BREAKING : రేపు కర్ణాటక CMగా ప్రమాణం చెయ్యనున్నయడ్యూరప్ప?

కర్ణాటక ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు తమకే అవకాశమివ్వాలంటూ అటు పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ, తమ కూటమికే సంఖ్యాబలం ఉన్నందున తమనే ఆహ్వానించాలని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి క్లెయిమ్ చేస్తుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బాజూభాయ్ వాలాను జేడీఎస్, కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలవనుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నామని, జేడీఎస్ పార్టీ లెజిస్లేచర్ నేత, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ నేత ఎన్నికకు సంబంధించిన రెండు లేఖలను గవర్నర్‌కు సమర్పించనున్నామని చెప్పారు. గవర్నర్ ఆహ్వానం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్‍ కూటమిని గవర్నర్ ఆహ్వానించని పక్షంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలంతా గురువారం రాజ్‌భవన్ వెలుపల బైఠాయింపు ధర్నా జరపాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ధర్నాలో ఎంపీలు సైతం పాల్గోనున్నారని తెలుస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ JDS కూటమి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే, బిజెపి మాత్రం గవర్నర్ ని కలిసి వచ్చేసింది. దీనితో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనకు వీలైనంత త్వరగా అవకాశం ఇవ్వాలని బీజేఎల్పీ నేత యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో పార్టీ శాసనసభ పక్ష సమావేశం తర్వాత ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తన మద్దతు దారుల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చారు. యడ్యూరప్ప రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యడ్యూరప్ప గవర్నర్‌తో భేటీ అయిన తర్వాత ఆ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.తాను శుక్రవారం మధ్యాహ్నం గం.12.20 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. అయితే ఇది బిజెపి నుంచి జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చేసిన ఎత్తుగడ గా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు కొట్టి పారేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన సంఖ్యాబలం మాకు ఉండగా వారిని ఎలా ఆహ్వానిస్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here