BREAKING : కర్ణాటక బిజెపికి భారీ ఝలఖ్ : JDS కూటమి లోకి ఆరుగురు బిజెపి MLAలు

కర్ణాటక రాజకీయం భారీ మలుపులు తిరుగుతుంది. పాత శత్రువులు కొత్త మిత్రులు అవుతున్నారు. జేడీఎస్‌ అధినేత దేవెగౌడకు సిద్దరామయ్య ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. జేడీఎస్‌లో కుమారస్వామి ఆధిపత్యం పెరిగిపోవడాన్ని వ్యతిరేకించడంతో 2005లో సిద్దరామయ్యను పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం కొత్త పార్టీ పెట్టిన ఆయన.. కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి సీఎం అయ్యారు. తాజాగా దేవెగౌడను, మాజీ సీఎం కుమార స్వామిని ప్రచార సభల్లో తూర్పారబట్టారు. ఇంతటి వైరమున్నా.. అధిష్ఠానం సూచన మేరకు సిద్దరామయ్య ఇలా దిగివచ్చారు. ఆనక రాజభవన్‌కు ఏకంగా కుమారస్వామి చేతులు పట్టుకొని వెళ్ళారు. ఆపై స్వయంగా తానే దళపతి దేవెగౌడ నివాసానికి వెళ్ళారు. దేవెగౌడ ఆయనకు సాదర స్వాగతం పలికారు. రెండు చేతులు జోడించి దేవెగౌడకు సిద్దరామయ్య నమస్కారం చేశారు. సిద్దరామయ్య గౌరవార్థం అక్కడ తేనీటి విందు కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ జెడిఎస్ మధ్యలో ఇంత రాజకీయం జరుగుతూ ఉండగా ఆరుగురు బిజెపి ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్దం అయ్యారు. నిన్న సాయంత్రం నుంచి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విజూభాయ్ వాలా ఎవరిని ఆహ్వానిస్తారనే ఉత్కంఠ నెలకొన్ని నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు జేడీఎస్-కాంగ్రెస్ కూటమి మెజారిటీకి అవసరమైన లెక్కలు, సమీకరణల్లో మునిగితేలుతున్నాయి. బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని, 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. మరోవైపు, ఆరుగురు బీజేపీ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేత ఎంబీ పాటిల్ సంచలన ప్రకటన చేశారు. మా పార్టీ వాళ్లంతా ఏకతాటిపై ఉన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కప్పదాట్లకు సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నిజానికి ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలే మాతో మంతనాలు జరుపుతున్నారు అని పాటిల్ మీడియాకు తెలిపారు. కాగా, తమ కూటమి అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని దాటేశామని, ఇప్పటికే 118 మంది ఎమ్మెల్యేలు తమకున్నందున ఇంకెవరి అవసరం తమకు లేదని కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఎన్ఏ హారిస్ తెలిపారు. అయితే ఈ కన్నడ రాజకీయం తేలటానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here